ప్రభుత్వ విప్‌పై బురదజల్లే కుట్రలు
వరి ధాన్యం అక్రమాల్లో దోషులను కాపాడేందుకే దుష్ప్రచారం
కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ తుమ్ జలపతి
కాకతీయ, రుద్రంగి: జిల్లాలో సంచలనం రేపిన వరి ధాన్యం కొనుగోలు అక్రమాల వ్యవహారంలో అసలు దోషులను కాపాడేందుకే ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌పై బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా జనరల్ సెక్రెటరీ తుమ్ జలపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డిలు మాట్లాడారు. అక్రమాలు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించి, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్లతో మాట్లాడి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారని వారు గుర్తుచేశారు.
కుట్రపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలి
ఈ కుంభకోణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వయంగా డిమాండ్ చేసిన నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను ప్రభుత్వ విప్ అనుచరులుగా చిత్రీకరించడం సమంజసం కాదని, ఈ కేసులో మధుకర్ అనే వ్యక్తి పాత్రతో పాటు అతనికి బీఆర్ఎస్ నాయకులతో ఉన్న సంబంధాలపై లోతుగా దర్యాప్తు జరగాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఈ అసత్య ప్రచారానికి దిగుతున్నాయని, ఇకనైనా బురదజల్లే రాజకీయాలు ఆపకపోతే ప్రతి గ్రామంలో ప్రజాక్షేత్రంలోనే బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుని నిలదీస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

