గొల్లపాడులో ముగ్గురు వ్యక్తుల ఆత్మహత్యాయత్నం
అప్పు తిరిగి రాదన్న మనస్తాపంతో ఘటన
కోటి 13 లక్షల మోసం నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత
ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
కాకతీయ, ఖమ్మం రూరల్: ఇచ్చిన అప్పు తిరిగి రాదన్న మనస్తాపంతో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. గొల్లపాడు గ్రామానికి చెందిన రుద్ర దేవేందర్ అనే వ్యక్తి, గత కొన్ని నెలలుగా సమీప బంధువులు, స్నేహితుల వద్ద మామిడి పండ్ల వ్యాపారం చేస్తానని, అధిక మొత్తంలో వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి సుమారు కోటి పదమూడు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. అయితే ఆ డబ్బులను తిరిగి ఇవ్వకుండా దేవేందర్ ఐపీ పెట్టడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం మందాటి స్వరూప, కొత్త నాగమణి కలిసి రుద్ర దేవేందర్ మేనల్లుడైన అమృతపు సైదులును కలిసి, నీ మేనమామ గురించి ఏమైనా సమాచారం ఉందా అని ఆరా తీశారు. దీనివల్ల గ్రామంలో తమ పరువు పోతుందని మనస్తాపం చెందిన అమృతపు సైదులు (40) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న మందాటి స్వరూప (55) మరియు కొత్త నాగమణి, తాము రుద్ర దేవేందర్‌కు డబ్బు ఇచ్చి తప్పు చేశామని, పైగా ఇప్పుడు తమపైనే నిందలు వేస్తున్నారన్న మనస్తాపంతో వారూ పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి, వారి ముగ్గురిని చికిత్స నిమిత్తం ఖమ్మంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

