నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నాణ్యమైన విత్తనాల విక్రయాలపై నిఘా
చందుర్తి మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు, ఎస్సై జిల్లెళ్ళ రమేష్
కాకతీయ, చందుర్తి : రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని చందుర్తి మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు అన్నారు. మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. దుకాణాల నిర్వహణ, విక్రయ విధానాలు, నాణ్యత ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
దుకాణ నిర్వాహకులు స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డులు, కొనుగోలు అమ్మకాల ఇన్వాయిసులు, లైసెన్స్ వివరాలను సక్రమంగా నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు, ఎరువుల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. విత్తనాల ఎక్స్‌పైరీ తేదీలు, నాణ్యత ప్రమాణాలు, నిల్వ విధానాలను వ్యవసాయ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని వారు స్పష్టం చేశారు. రైతులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, గడువు తేదీలు, నాణ్యతను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. ఈ తనిఖీల్లో చందుర్తి మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు, చందుర్తి మండల ఎస్సై జిల్లెళ్ళ రమేష్ పాల్గొన్నారు.

