పంట పొలాల్లో కాంక్రీట్ కోరలు
పచ్చని భూమిలో అక్రమంగా ఆర్ఎంసీ ప్లాంట్!
లీజు పేరుతో లూటీ.. ఏడెకరాల్లో అక్రమ దందా!
మూడు కుంటల అనుమతితో.. భారీ యంత్రాల హోరు!
నీరు, నేల కలుషితం.. పర్యావరణానికి ముప్పు!
మే నెలలోనే ఫిర్యాదు.. అధికారుల మౌనం!
నిబంధనల ఉల్లంఘన.. పట్టించుకోని యంత్రాంగం!
న్యాయం కోసం వేచిచూస్తున్న స్థానికులు!
కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో సాగు భూమి అక్రమాలతో కలుషితమవుతోంది. ఎన్ హెచ్ 365-ఏ రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం సుమారు ఏడెకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకున్న జి ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఒప్పందాన్ని ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తోంది. సర్వే నంబర్లు 62అ/2, 64/అ/1/2, 64/అ/1, 76/ఈ/3, 76/ఈ/2 పరిధిలో ఉన్న ఈ ఏడెకరాల భూమిని ఏడాదికి లక్ష తొంబై ఆరు వేల రూపాయల లీజుకు తీసుకున్న సదరు సంస్థ, రోడ్డు పనులకు అవసరమైన యంత్రాలు, కార్మికుల నివాసాల కోసం మాత్రమే వాడుకోవాలని ఒప్పందం చేసుకుంది. అయితే, దీనికి విరుద్ధంగా అక్కడ భారీ ‘రడీ మిక్స్ కాంక్రీట్ ’ ప్లాంట్‌ను స్థాపించి కమర్షియల్ దందాను ముమ్మరం చేసింది.

నిబంధనలకు పాతర..
తెలంగాణ భూభారతి పోర్టల్ రికార్డుల ప్రకారం సదరు ఏడెకరాల భూమిలో కేవలం మూడు కుంటలకు మాత్రమే ‘నాలా కన్వర్షన్’ అనుమతులు ఉన్నాయి. మిగిలిన భూమి అంతా వ్యవసాయ భూమిగానే ఉన్నప్పటికీ, నిర్మాణ సంస్థ ఏమాత్రం ల్యాండ్ కన్వర్షన్ చేయకుండానే, ఇష్టానుసారంగా భారీ యంత్రాలతో ప్లాంట్ నడుపుతోంది. దీనివల్ల సిమెంట్, ఇతర రసాయన వ్యర్థాలు పంట పొలాల్లోకి చేరుతుండటంతో భూమి సారం దెబ్బతింటోందని, భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అనుమతులు లేని ప్లాంట్ నిర్వహణ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కాలుష్య మండలికి ఫిర్యాదు చేసినా..
ఈ అక్రమ కార్యకలాపాలపై మే నెలలోనే ఖమ్మం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. నిబంధనలను అతిక్రమించి, పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ప్లాంట్ నడపడం వల్ల స్థానిక భూములకు తీవ్ర నష్టం జరుగుతోందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, నెలలు గడుస్తున్నా, అధికారులు ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
తక్షణమే అక్రమ ప్లాంట్ తొలగించాలి
నిబంధనలను తుంగలో తొక్కి, పచ్చని పంట పొలాలను నాశనం చేస్తున్న సంస్థపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తన జీవనాధారమైన ఈ భూమిని కాపాడాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ ఆర్ఎంసి ప్లాంట్‌ను వెంటనే తొలగించాలని రైతు కోరుతున్నారు. తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేయకుండానే, కేవలం మూడు కుంటల నాలా పర్మిషన్ తోనే అక్రమ ప్లాంట్ స్థాపించి కాంట్రాక్టర్ తన పనులు చక్కబెట్టుకుంటున్నాడని, అధికారులు స్పందించి పర్యావరణానికి జరుగుతున్న విఘాతాన్ని ఆపాలని రైతు వేడుకుంటున్నారు.
నాలా కన్వర్షన్ లేకుండానే ఆర్ఎంసి ప్లాంట్ : వట్టేకోటి చిన్న వెంకన్న, రైతు
మా భూమిలో నాలా కన్వర్షన్ లేకుండానే ఆర్ఎంసి ప్లాంట్ ఏర్పాటు చేసి, ఇష్టానుసారంగా భూసారాన్ని దెబ్బతీస్తున్నారు. అడిగితే ఇబ్బందులకు గురిచేస్తూ జులుం చూపిస్తున్నారు. ఈ ప్లాంట్ వల్ల భూగర్భ జలాలకు, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. రెవిన్యూ అధికారులు విచారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.


