పీఆర్సీ, ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలి
తపస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా
కాకతీయ, ఖమ్మం: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, గత మూడేళ్లుగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను ఆమోదించి, 51 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సేవ్యా నాయక్ మాట్లాడుతూ, పీఆర్సీ, డీఏల జాప్యం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని అన్నారు.
ధర్నాలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలి. కేజీబీవీ, సమగ్ర శిక్ష, మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. 317 జీవో బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి.
2010 టెట్‌కు ముందు నియమితులైన వారికి టెట్ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ముడుంబ రంగనాథ్, పలివెల అంజనీ కృష్ణ, జిల్లా ఆర్థిక కార్యదర్శి వేముల రవికిరణ్, కోటేశ్వరరావు, పెన్షనర్స్ సంఘం నాయకులు మత్తి వెంకటేశ్వర్లు, రామ్మోహన్, సుబ్బారావు, శంకరం బాబు మరియు భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

