నేడు మణుగూరుకు నలుగురు మంత్రులు
సీతారామ, మారెళ్లపాడు ప్రాజెక్టుల పరిశీలన
క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై ప్రత్యేక సమీక్ష
ప్రాజెక్టులను వేగవంతం చేసే దిశగా మంత్రుల దిశానిర్దేశం
ప్రాధాన్యత సంతరించుకున్న మణుగూరు పర్యటన
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతానికి బుధవారం నలుగురు రాష్ట్ర మంత్రులు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మణుగూరులో పర్యటించనున్నారు. ఒకేసారి నలుగురు అగ్రనేతలు, మంత్రులు మణుగూరుకు వస్తుండటం ఈ ప్రాంతంలో రాజకీయంగా, అభివృద్ధి పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ పర్యటనలో భాగంగా మంత్రుల బృందం పినపాక నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు, మారెళ్లపాడు ప్రాజెక్టు, అలాగే సీతమ్మ బ్యారేజి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఆయా ప్రాజెక్టుల నిర్మాణం ఏ దశలో ఉంది? ఎదురవుతున్న సమస్యలేంటి? అనే అంశాలపై నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రులు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన దిశానిర్దేశం చేయనున్నారు.
పెద్ద ఎత్తున ఏర్పాట్లు
మంత్రుల పర్యటన నేపథ్యంలో మణుగూరు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని సమాచారం. మంత్రుల పర్యటనతో ప్రాజెక్టుల పనుల్లో కదలిక వస్తుందని, అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు.

