పంట పొలాల్లో అక్రమ ‘ప్లాంట్’..
నిబంధనలకు తిలోదకాలిచ్చిన రెడీమిక్స్ ప్లాంట్ సంస్థ
ఏడెకరాల్లో పనులు.. కేవలం 3 కుంటలకే నాలా కన్వర్షన్
రెవెన్యూ అధికారుల విచారణలో వెల్లడి
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న జీఎస్‌ఆర్ కన్స్ట్రక్షన్స్
గ్రామ పంచాయతీ తీర్మానాలపై ఆరోపణలు
కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం రెవెన్యూ పరిధిలో వ్యవసాయ భూమిలో అనధికారికంగా ఏర్పాటు చేసిన ఆర్‌ఎంసీ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. సుమారు ఏడెకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ కొనసాగుతుండగా, కేవలం మూడు కుంటలకు మాత్రమే నాలా కన్వర్షన్ అనుమతులు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. దీనిపై ‘కాకతీయ’ పత్రికలో “పంట పొలాల్లో కాంక్రీట్ కోరలు” శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

అసలేం జరిగింది?
ఖమ్మం నుంచి కురవి వరకు చేపట్టిన నేషనల్ హైవే నిర్మాణ పనుల కోసం జీఎస్‌ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ కాచిరాజుగూడెం గ్రామంలోని సర్వే నెంబర్లు 62/అ/2, 64/అ/1/2, 64/అ/1, 76/ఇ/3, 76/ఇ/2 లోని ఏడెకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుంది. నిబంధనల ప్రకారం వాణిజ్య కార్యకలాపాల కోసం భూమార్పిడి (నాలా కన్వర్షన్) చేసుకోవాల్సి ఉండగా, సంస్థ మాత్రం కేవలం మూడు కుంటలకు మాత్రమే అనుమతులు పొంది, మిగిలిన భూమిని వ్యవసాయ భూమిగానే చూపిస్తూ భారీ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది.
అధికారుల నివేదిక..
కథనంపై స్పందించిన కాచిరాజుగూడెం గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించాం. ప్లాంట్ ఏర్పాటు చేసిన వ్యవసాయ భూమికి సంస్థ ఎటువంటి నాలా కన్వర్షన్ తీసుకోలేదని ప్రాథమికంగా గుర్తించాం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం” అని స్పష్టం చేశారు.
పంచాయతీ తీర్మానంపై వివాదం
గ్రామ పంచాయతీ పరిధిలో 76/ఇ/2 సర్వే నెంబర్ కు మాత్రమే అనుమతులు ఇచ్చారని, కానీ మిగిలిన సర్వే నెంబర్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాంట్ ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొందరు వార్డు సభ్యులకు తెలియకుండానే పంచాయతీ కార్యదర్శి అనుమతులు జారీ చేశారని, దీనివల్ల గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి పడటంతో పాటు పర్యావరణం, భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్థులు వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకుంటున్నారు.
లోకయుక్తకు వెళ్తాం : బాధితులు
గతంలోనే పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, లీజు పేరుతో పచ్చని పంట పొలాలను కలుషితం చేస్తున్న జీఎస్‌ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ కట్టడాలను అడ్డుకోవాలని, లేనిపక్షంలో లోకయుక్తను ఆశ్రయిస్తామని బాధితులు హెచ్చరించారు.

