- ఏన్కూరు పోలీస్ స్టేషన్లో ఘటన
- తీవ్రంగా గాయపడిన మహిళ
- ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
కాకతీయ, ఏన్కూర్ : ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల పరిధిలోని ఎర్రబోడు తండాకు చెందిన భూక్య రాంబాబు.. తన భార్య రజినిపై కత్తితో దాడి చేసిన ఘటన సోమవారం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణం చోటుచేసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రజిని తన పుట్టింటి గ్రామమైన సాతానిగూడెంలో ఉంటోంది. ఈ క్రమంలో గ్రామ సంఘం ద్వారా తీసుకున్న రుణం చెల్లించాలని సంఘ సభ్యులు ఒత్తిడి చేయడంతో రజినిని ఏన్కూరులోని ఎస్బీఐ బ్యాంకుకు తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న భర్త రాంబాబు బ్యాంకు వద్దకు వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో, అంతకుముందు రజిని కూతురు తన తల్లిపై ఏన్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. విచారణ నిమిత్తం పోలీసులు రజినిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్లడాన్ని గమనించిన రాంబాబు అక్కడికి చేరుకుని తన వద్ద ఉన్న కత్తితో రజినిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె ఎడమ భుజం, ఎడమ చేతి మణికట్టు భాగంలో కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది.
పోలీస్ స్టేషన్లోనే ఉద్రిక్తత..
బాధతో ఆమె కేకలు వేయడంతో అక్కడున్న పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆమెకు చికిత్స కొనసాగుతోంది. నేరుగా పోలీస్ స్టేషన్లోనే ఈ ఘటన జరగడంతో ఏన్కూరు పీఎస్ పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏన్కూరు పోలీసులు తెలిపారు.

