- ఖమ్మం ఉమెన్స్ కాలేజీ వద్ద భారీ మానవహారం, నిరసన
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
కాకతీయ, ఖమ్మం : ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఆందోళనకు సంఘీభావంగా.. పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని స్థానిక ఉమెన్స్ కాలేజీ వద్ద భారీ ఎత్తున విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడి మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల కోసం ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, వారి గొంతును వినకుండా నిరసనలను అణచివేయడానికి ప్రయత్నించడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, పరీక్షల నిర్వహణలో భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల నిర్బంధ చర్యలను వెంటనే నిలిపివేయాలని, విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది.
విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు యశ్వంత్, స్టాలిన్, మనోజ్, మహేష్, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.

