యువత భవిష్యత్తు కోసమే రాహుల్ గాంధీ పోరాటం
కారేపల్లి క్రాస్‌రోడ్‌లో కాంగ్రెస్ శ్రేణుల భారీ రాస్తారోకో
కాకతీయ, కారేపల్లి: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తీవ్ర నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరపురెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, సింగరేణి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కారేపల్లి క్రాస్‌రోడ్‌లో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఢిల్లీలో న్యాయబద్ధంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దౌర్జన్యం వల్ల రాహుల్ గాంధీకి గాయాలై ముక్కు నుండి రక్తం కారడం దారుణమని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులపై ఇటువంటి దాడులు చేయడం విలువలకే గొడ్డలిపెట్టని మండిపడ్డారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించడం అమానుషమని, ప్రశ్నించే గొంతులను పోలీసు బలగాలతో నొక్కేయడం మోదీ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్యా రంజిత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సురేందర్ మణీయర్, బానోత్ రామూర్తి నాయక్, అడ్డగోడ ఐలయ్య, దిశా కమిటి మెంబెర్ హేమలత బాలాజీ, మేదరి టోనీ, ఎండి అనీఫ్, ఆదర్ల రాములు, ఈసాల ఛాయాదేవి, భీముడు, గుగులోత్ రవీందర్ తో పాటు పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

