అడవిని కాపాడితే.. దాడులా?
అటవీ సిబ్బందికి రక్షణ కల్పించాలి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అధికారుల వినతి
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: అటవీ సంరక్షణ విధులు నిర్వహిస్తున్న తమపై దాడులు జరుగుతున్నాయని, భద్రత కల్పించకపోతే విధులు నిర్వర్తించడం కష్టమవుతుందని అటవీశాఖ సిబ్బంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు విన్నవించారు. శుక్రవారం మణుగూరు పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రిని అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు కలిసి అటవీ శాఖ ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అటవీ ప్రాంతాల్లో ప్లాంటేషన్ పనులు చేపడుతున్న సమయంలో కొందరు తమపై దాడులకు పాల్పడుతున్నారని, అనంతరం తమపైనే కేసులు నమోదవుతున్నాయని వివరించారు. అశ్వాపురం మండలం మనబోతులగూడెం పంచాయతీ పరిధిలోని వేములూరు గ్రామంలో ఒప్పందం మేరకు ప్లాంటేషన్ పనులు నిర్వహిస్తుండగా కొందరు మహిళలు దాడి చేశారని పేర్కొన్నారు.
సమస్య పరిష్కారానికి హామీ
అటవీ సిబ్బందికి తగిన భద్రత కల్పించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు ఉప ముఖ్యమంత్రిని కోరారు. తమకు రక్షణ లేకపోతే విధులు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు. వినతిని స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమస్యను సానుకూలంగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు.

