- బీజేపీ జాతీయ పొంగులేటి సుధాకర్ రెడ్డి
కాకతీయ, ఖమ్మం టౌన్: ఢిల్లీలో జంతర్‌మంతర్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న నిరసనలు రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న బూటకపు డ్రామాలేనని బీజేపీ జాతీయ నాయకుడు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఖమ్మంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని, నకిలీ ఓట్లు తొలగిపోతున్నాయనే భయంతోనే కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలు నెరవేర్చలేదన్నారు. అభివృద్ధి మందగించిందని, ప్రజా సమస్యల పరిష్కారం కంటే రాజకీయాలకే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

