- విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించాలి
- హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
- ఆత్మకూరులో పాఠశాల, పీహెచ్‌సీ, సోలార్ పనుల ఆకస్మిక తనిఖీ
కాకతీయ, ఆత్మకూరు: “విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యం. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి” అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు. గురువారం ఆత్మకూరు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మోడల్ సోలార్ విలేజ్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు పాఠాలు బోధించే విధానంపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. బోర్డుపై పాఠ్యాంశాలు రాయడం మాత్రమే కాకుండా డిక్టేషన్ ద్వారా విద్యార్థుల్లో చదవడం, రాయడం పట్ల నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లిష్‌లో చదవడం, రాయడంలో విద్యార్థులను తీర్చిదిద్దాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరగాలి


ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య సంస్థల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. వైద్యులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండి ప్రతి రోగికి సకాలంలో చికిత్స అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓపీ వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, గర్భిణులకు నాణ్యమైన మాతా–శిశు ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా సేవాభావంతో పనిచేయాలని సూచించారు. ఆత్మకూరులో అమలవుతున్న మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్, మిగిలిన లబ్ధిదారుల ఇళ్లపై సోలార్ యూనిట్ల ఏర్పాటు పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన సామగ్రిని వెంటనే సమీకరించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ తనిఖీల సందర్భంగా గ్రామ సర్పంచ్ మహేశ్వరి, ఎంఈఓ విజయ్ కుమార్, తహసీల్దార్ జగన్‌మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ స్పందన, టీజీ రెడ్‌కో అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

