సమయం లేదు… కూల్చాల్సిందే
ముదిగొండలో పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాల తొలగింపు
గడువు కోరినా నిరాకరణ.. బాధితుల ఆవేదన
పరిహారంపై స్పష్టత లేకుండానే బుల్డోజర్లు
వల్లభి రహదారి విస్తరణతో ఉద్రిక్తత
కాకతీయ, ముదిగొండ: “సమయం లేదు… కూల్చాల్సిందే” అంటూ అధికారులు ముందుకు సాగడంతో ముదిగొండలో వల్లభి రహదారి విస్తరణ పనులు శనివారం ఉద్రిక్తతకు దారితీశాయి. బస్టాండ్ సెంటర్ నుంచి సువర్ణాపురం వరకు చేపడుతున్న రహదారి విస్తరణలో భాగంగా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లు, దుకాణాల తొలగింపు చేపట్టారు. రెండేళ్లుగా కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులు గతంలో బాధితుల అభ్యంతరాలు, కోర్టు కేసుల కారణంగా పలుమార్లు వాయిదా పడ్డాయి. శనివారం తెల్లవారుజామున అధికారులు మార్కింగ్ పూర్తి చేసి అనంతరం బుల్డోజర్లతో కూల్చివేతలు ప్రారంభించారు. గతంలో 70 అడుగుల మేర మాత్రమే విస్తరణ ఉంటుందని చెప్పి ఇప్పుడు 80 అడుగుల వరకు మార్కింగ్ చేశారని బాధితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తగిన పరిహారం ప్రకటించకుండా ఇళ్లు కూల్చివేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే చర్యలు చేపడుతున్నామని, ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలకు ప్రత్యేక గడువు అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. రెండు రోజుల గడువు ఇవ్వాలని బాధితులు వేడుకున్నా అధికారులు నిరాకరించడంతో కూల్చివేతలు కొనసాగాయి. వ్యాపారులు, ఇంటి యజమానులు చేతికి అందిన సామగ్రిని హుటాహుటిన బయటకు తరలించుకున్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, పరిహారంపై స్పష్టత ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం పరిహారం అంశంపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.


