గోదావరి ఉప్పొంగినా ఆగని ఇసుక ర్యాంపులువరదల్లో చిక్కుకున్న 60 మంది
వరదల్లో ప్రాణాలతో చెలగాటం వద్దు
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్
ర్యాంపులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: గోదావరికి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు జారీ అయినా చర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంపులను కొనసాగించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ వరద నీటిలోకి లారీలను పంపడంతో 40 మంది లారీ డ్రైవర్లు, మరో 20 మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని తెలిపారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన తర్వాత కూడా ఇసుక ర్యాంపులను మళ్లీ ప్రారంభించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఫారెస్ట్ భూముల పేరుతో ఆదివాసీలపై కేసులు పెడుతున్న అధికారులు, వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా స్పందించడం లేదని ఆరోపించారు. టీఎస్‌ఎండీసీ, జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని ఇసుక ర్యాంపులను నిలిపివేయాలని, ఆదివాసీలపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నాయకురాలు కోట నాగమణి, పాయం రాజమ్మ, కొండా స్వామి తదితరులు పాల్గొన్నారు.

