నల్లబెల్లిలో పెద్ది విగ్రహానికి భూమిపూజ
అఖిలపక్షం ఏకగ్రీవ నిర్ణయానికి గ్రామస్థుల మద్దతు
కాకతీయ. నల్లబెల్లి: మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి జ్ఞాపకార్థం నల్లబెల్లి మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. గ్రామపంచాయతీ పాలకవర్గం విగ్రహ ఏర్పాటుకు ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో కార్యక్రమానికి విశేష ప్రాధాన్యం ఏర్పడింది.
ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం నర్సంపేట నియోజకవర్గ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రజలతో మమేకమై సేవలందించిన ఆయన సేవలను చిరస్థాయిగా నిలిపేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, అభిమానులు ఒకే వేదికపైకి వచ్చి విగ్రహ ఏర్పాటుకు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచి ఉద్యమ స్ఫూర్తిని చాటిన పెద్ది సుదర్శన్‌రెడ్డి రాష్ట్ర ఏర్పాటు అనంతరం నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు ఇక మన మధ్య లేకపోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్షం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం, గ్రామపంచాయతీ తీర్మానం చేయడం అభినందనీయమని పేర్కొంటూ, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగేళ్లి జ్యోతి-ప్రకాశ్ రాజారాం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.

