కొరియన్ యువతితో మహేష్ మేనల్లుడి నిశ్చితార్థం
కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వేడుక
ఫొటోలను పంచుకున్న నమ్రత
ప్రత్యేక ఆకర్షణగా రమేష్‌బాబు కుమార్తె భారతి
కాకతీయ, హైదరాబాద్ : సూపర్‌స్టార్ మహేష్‌బాబు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. మహేష్‌బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్–పద్మావతి దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా కొరియన్ యువతి హాయిన్ (జిన్నీ)తో నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆదివారం ఈ వేడుక ఘనంగా జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను మహేష్‌బాబు సతీమణి నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలో మహేష్‌బాబు కుటుంబ సభ్యులతో పాటు ఆయన అక్కలు, దివంగత రమేష్‌బాబు కుమార్తె భారతి పాల్గొన్నారు. ఈ వేడుకలో భారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సిద్ధార్థ్ గల్లా ప్రస్తుతం కుటుంబ వ్యాపార వ్యవహారాలను చూసుకుంటుండగా, కొంతకాలంగా హాయిన్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల అంగీకారంతో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా, సిద్ధార్థ్ సోదరుడు అశోక్ గల్లా హీరోగా నటించిన ‘విసా’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు మహేష్‌బాబు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

