50 ఏళ్లుగా చీకట్లో జంగాల కాలనీ
ఎన్నికల హామీలే తప్ప అభివృద్ధి జాడలేదు
రోడ్లు, విద్యుత్ సౌకర్యం లేక 100 కుటుంబాల అవస్థలు
బురద రోడ్డులో వరినాట్లు వేసి వినూత్న నిరసన
కాకతీయ, ఏన్కూర్: ఏన్కూర్ మండల కేంద్రంలోని జంగాల కాలనీ ఐదు దశాబ్దాలుగా కనీస మౌలిక వసతులకు నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురవుతోంది. సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీలో రోడ్లు, విద్యుత్ స్తంభాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే ప్రజాప్రతినిధులు, ఆ తర్వాత కాలనీని పూర్తిగా విస్మరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వర్షాలు కురిస్తే రహదారులు పూర్తిగా బురదమయంగా మారి రాకపోకలు స్తంభిస్తున్నాయని, చిన్నారులు బురదలోనే పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. రాత్రివేళల్లో వీధి దీపాలు లేక చీకటిలో పాములు, విషపురుగుల భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలనీ సమస్యలపై ఎన్నిసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో కార్మిక సంఘం నాయకుడు ఇటికాల లెనిన్ ఆధ్వర్యంలో స్థానికులు బురద రోడ్డుపైనే వరినాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు నిర్మించడంతో పాటు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

