మట్టి మాఫియా వెనుక ఎవరున్నారు..?
మెడికల్ కళాశాల భూమిలో డోలమైట్ విక్రయాలు..:
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా
రఘునాథపాలెంలో అక్రమ తవ్వకాలపై ఐయూఎంఎల్ తీవ్ర ఆరోపణలు
కాకతీయ, రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో జరుగుతున్న మట్టి మాఫియాపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షులు షేక్ బాజీ బాబా డిమాండ్ చేశారు. రఘునాథపాలెంలో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలు, ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా కమిటీ బృందం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మట్టి మాఫియాపై తీవ్ర విమర్శలు చేసిన ప్రస్తుత పాలకులు, ఇప్పుడు రెండేళ్లుగా కొనసాగుతున్న అక్రమ తవ్వకాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నది ఎవరో, వారికి అధికార పార్టీ నాయకులు, మైనింగ్ అధికారులతో ఉన్న సంబంధాలేమిటో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
అధికారులపై ఒత్తిళ్లున్నాయా..?
మెడికల్ కళాశాల నిర్మాణం చివరి దశకు చేరుకున్నప్పటికీ భూమి చదును పేరుతో కోట్ల రూపాయల విలువైన మట్టిని విక్రయిస్తున్నారని, అదే స్థలంలో ఉన్న డోలమైట్ ఖనిజాన్ని కూడా తరలించారని షేక్ బాజీ బాబా ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని వారు చెబుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఒక లారీ మట్టి రూ.2000 ఉండగా ప్రస్తుతం రూ.6000కు చేరిందని, మట్టి ధర పెరిగిందా, లేక లంచాల రేటు పెరిగిందా అనే అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రజల మద్దతుతో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

