భట్టి ఆశీస్సులు.. కిషోర్‌కు కీలక పదవి?
డీసీసీబీ చైర్మన్ రేసులో ముందంజ
రాష్ట్ర కార్పొరేషన్ పదవిపైనా జోరుగా చర్చ
రెండు పదవుల్లో ఏదో ఒకటి దక్కేనా?
కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో నామినేటెడ్ పదవుల వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి కిషోర్ కుమార్‌కు కీలక పదవి దక్కనుందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పదవితో పాటు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవికి కూడా ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కిషోర్ కుమార్‌కు ఏ పదవి దక్కుతుందన్నది జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నామినేటెడ్ పదవులపై కసరత్తు
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించిన నేపథ్యంలో జిల్లాల వారీగా ఆశావహుల పేర్లపై కసరత్తు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ క్రమంలో ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పదవికి పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ కిషోర్ కుమార్ పేరు ముందువరుసలో ఉందనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో రాష్ట్రస్థాయిలో ఓ కార్పొరేషన్ చైర్మన్ పదవికి కూడా ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కిషోర్ కుమార్‌కు ఉన్న రాజకీయ అనుబంధం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. భట్టి వర్గంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న కిషోర్‌కు పార్టీ పరంగా ప్రాధాన్యమైన బాధ్యత అప్పగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా స్థాయిలో రాజకీయంగా కీలకమైన డీసీసీబీ పదవిని ఇస్తారా.. లేక రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతను అప్పగిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.
ఖమ్మం కాంగ్రెస్‌లో కొత్త సమీకరణాలా?
కిషోర్ కుమార్‌కు పదవి దక్కితే ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం పడే అవకాశముందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల కోసం పలువురు సీనియర్ నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో కిషోర్ పేరు రెండు కీలక పదవులకు పరిశీలనలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఏ పదవికీ అధికారికంగా ఖరారు కాలేదు. అధిష్ఠానం తుది నిర్ణయం తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.

