ఆపదలో ఆపన్నహస్తం.. మిత్రబంధానికి నిదర్శనం!
మిత్రుడి కుటుంబానికి రూ.27 వేల సాయం..
మరో మిత్రుడి కుమార్తెకు రూ.1.10 లక్షల డిపాజిట్
కాకతీయ, కారేపల్లి: చిన్ననాటి స్నేహం చెరిగిపోకుండా కొనసాగిస్తూ ఆపదలో ఉన్న మిత్రుల కుటుంబాలకు మాదారం కే.వి. విద్యానికేతన్ పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. 2004లో పదో తరగతి చదివిన రమేష్ తల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందడంతో శనివారం నిర్వహించిన సంస్మరణ సభకు హాజరైన పూర్వ విద్యార్థులు ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రమేష్ కుటుంబానికి రూ.27 వేల ఆర్థిక సాయం అందించారు. అలాగే అకాల మృతి చెందిన మరో మిత్రుడు వీరన్న కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె పేరుపై రూ.1.10 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల వ్యవస్థాపక కరస్పాండెంట్, గురువు కప్పెర రంగారావును పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. మాదారం నుంచి దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడినప్పటికీ పాఠశాల, గురువులు, మిత్రులతో అనుబంధం కొనసాగిస్తామని తెలిపారు. మిత్రుల కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అజ్మీర నరేష్‌తో పాటు బోడా రమేష్ నాయక్, అజ్మీర సురేష్ నాయక్, భట్టు వీరు, బాలు, లచ్చు, బానోత్ నాగేష్, దుంపటి గోవిందు, పోతనబోయిన ఉమారావు, రాంబాబు, అజ్మీర రజిని తదితరులు పాల్గొన్నారు.

