నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తేవడమే లక్ష్యం
: కాకతీయ ఎడిటర్ అరెల్లి కిరణ్ గౌడ్
మరింత విస్తృతంగా ప్రజల్లోకి : మేనేజింగ్ డైరెక్టర్ గోపికృష్ణ
రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన కాకతీయ
కాకతీయ, వరంగల్ బ్యూరో: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, వాస్తవాలను నిష్పక్షపాతంగా ప్రజల ముందుంచడం, బాధ్యతాయుతమైన జర్నలిజంతో సమాజానికి దిశానిర్దేశం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ‘ఉత్తరం కాకతీయ’ దినపత్రిక తొలి ఏడాది ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా శనివారం పత్రిక కార్యాలయంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎండీ పేరం గోపికృష్ణ, ఎడిటర్ అరెల్లి కిరణ్ గౌడ్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

ప్రజల నమ్మకమే బలం
ఈ సందర్భంగా ఎడిటర్ అరెల్లి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ తొలి ఏడాదిలోనే పాఠకుల ఆదరణ, ప్రజల విశ్వాసం పొందడం సంతోషంగా ఉందన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ముందున్న ప్రధాన బాధ్యత అని తెలిపారు. అధికారాన్ని ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించడం, అన్యాయాన్ని ఎత్తిచూపడం, బాధితుల గొంతుకగా నిలవడం జర్నలిస్టు బాధ్యత అన్నారు. సంచలనం కంటే వాస్తవానికి, ఒత్తిళ్ల కంటే నైతిక విలువలకు, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనానికే ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. నిజం ఎవరి వైపు ఉన్నా ‘ఉత్తరం కాకతీయ’ నిలిచేది నిజం వైపేనని పేర్కొన్నారు. ఎండీ పేరం గోపికృష్ణ మాట్లాడుతూ పాఠకుల ఆదరణ, జర్నలిస్టుల అంకితభావం, సిబ్బంది కృషితో తొలి ఏడాది విజయవంతమైందన్నారు. రెండో ఏడాదిలో పత్రికను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేస్తామని తెలిపారు. ప్రజల విశ్వాసమే పునాదిగా, నిజమే నినాదంగా ప్రస్థానాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో చీఫ్ ఉమ్మల సందీప్, రిపోర్టర్లు సంపత్, యకయ్య, పాత్రికేయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

