హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి
ప్రభుత్వ హామీల కమిటీకి స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలి
ఎన్నికల మేనిఫెస్టో హామీలను కమిటీ పరిధిలోకి తేవాలి
అధికారులను పిలిచి వివరణ కోరే అధికారం కల్పించాలి
క్రమం తప్పకుండా సమావేశాలు, స్టడీ టూర్లు నిర్వహించాలి
బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు
కాకతీయ, హైదరాబాద్ : శాసనమండలి ప్రభుత్వ హామీల కమిటీ ప్రజల పక్షాన పనిచేసేలా స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు కోరారు. గురువారం నిర్వహించిన కమిటీ ప్రారంభ సమావేశంలో పాల్గొన్న ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కమిటీ పరిధిలోకి వచ్చే ‘హామీలు’ అంటే సభలో మంత్రులు ఇచ్చే హామీలకే పరిమితమా.. లేక ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన హామీలు కూడా ఇందులోకి వస్తాయా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
మహిళలకు రూ.2,500 అందిస్తామన్న హామీ వంటి ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధాన అంశాల అమలును కూడా కమిటీ పరిశీలించాలని రవీందర్రావు సూచించారు. పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని హామీల అమలుపై నిలదీసేలా కమిటీకి తగిన అధికారాలు ఉండాలని అన్నారు. అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులను కమిటీ ముందు పిలిచి వివరణ కోరే వెసులుబాటు కల్పించాలని కోరారు.
చైర్మన్‌కు అభినందనలు
శాసనమండలిని ప్రస్తుత భవనంలోకి మార్చి సభ్యుల గౌరవాన్ని పెంచిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి రవీందర్రావు కృతజ్ఞతలు తెలిపారు. చాలాకాలం తర్వాత కమిటీల ఏర్పాటు జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. తదుపరి సమావేశం నాటికి కమిటీ అధికారాలు, విధివిధానాలపై పూర్తి స్పష్టత ఇవ్వాలని కోరారు. కమిటీ క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడంతో పాటు స్టడీ టూర్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండలి వైస్‌చైర్మన్ బండా ప్రకాశ్, కమిటీ చైర్మన్ కేతావత్ శంకర్, అధికారులు పాల్గొన్నారు.

