విద్యార్థుల జీవితాలతో చెలగాటమా
స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే చెల్లించాలి
రెండున్నరేళ్లుగా కాలయాపన సరికాదు
మంత్రుల నివాసాలను ముట్టడిస్తాం
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ
కాకతీయ, ఖమ్మం టౌన్ : విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రెండున్నరేళ్లుగా చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ హెచ్చరించారు. శుక్రవారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్‌యూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదరికం విద్యార్థుల చదువులకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రూపొందించారని, ప్రస్తుతం అదే హక్కును ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. విద్యాసంస్థలు మూసివేసి నిరసన తెలిపినా ప్రభుత్వానికి చలనం లేదన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రెండేళ్లుగా రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని విమర్శించారు. న్యాయస్థానాలు విద్యార్థుల ఖాతాల్లో స్కాలర్‌షిప్‌లు జమ చేయాలని ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా ఇంజనీరింగ్, వైద్య, ఫార్మసీ, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు విద్యాసంస్థల యాజమాన్యాలు ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 20లోపు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 17న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మంత్రుల నివాసాల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సమావేశంలో శశికిరణ్, తిమ్మిడి రఘు, యశ్వంత్, వెంకటేష్, సుశాంత్, త్రినాధ్, మనీష్ పాల్గొన్నారు.

