త్రివర్ణ పతాకాలతో దేశభక్తి వెల్లువ
ఏన్కూరు వీధుల్లో మార్మోగిన స్వాతంత్య్ర నినాదాలు
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల స్మరణ
భారీ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువత, ప్రజలు
కాకతీయ, ఏన్కూర్ : ఏన్కూరు మండల కేంద్రంలో శుక్రవారం దేశభక్తి వెల్లివిరిసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ముందస్తు ర్యాలీలో విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు త్రివర్ణ పతాకాలతో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం, జైహింద్ నినాదాలతో ప్రధాన వీధులు మార్మోగాయి. త్రివర్ణ పతాకాల రెపరెపలతో మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన సమరయోధుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పలువురు పేర్కొన్నారు. స్వాతంత్య్ర వేడుకలు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేయాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర, సమరయోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, సామాజిక బాధ్యత, జాతీయ సమైక్యత భావాలను పెంపొందించాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాల రెపరెపలు, దేశభక్తి నినాదాల మధ్య సాగిన ర్యాలీ ఏన్కూరులో స్వాతంత్య్ర వేడుకల సందడిని ముందుగానే తీసుకొచ్చింది.

