ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చాలి
హైస్కూల్, జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మించాలి
విద్య, వైద్యం, మౌలిక వసతులు మెరుగుపరచాలి
ప్రజావాణిలో సీపీఐ(ఎం) వినతి
కాకతీయ, కారేపల్లి : ఏజెన్సీ మండలమైన కారేపల్లిలో ప్రజలకు మెరుగైన విద్య, వైద్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు వినతిపత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కె. నరేంద్ర మాట్లాడుతూ.. కారేపల్లి మండలంలో 41 పంచాయతీలు, 86 శివారు గ్రామాలు, సుమారు 70 వేల జనాభా ఉందన్నారు. ఇంత పెద్ద జనాభా ఉన్న మండలంలో ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, రవాణా, ఇతర మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేసి 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేశారు. తద్వారా మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మండలంలోని మరో ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న మహిళా వైద్యురాలు, ఫార్మసిస్ట్, సూపర్‌వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంత ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితిని నివారించాలని కోరారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కళాశాలలకు ప్రహరీ గోడ నిర్మించాలని సీపీఐ(ఎం) నాయకులు కోరారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన వంట షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సీ, బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మాణిక్యారం నుంచి మోట్లగూడెం వరకు మెటల్ వేసి అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. మండలంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించి ప్రజల రవాణా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు వజ్జా మారావు, కొండబోయిన ఉమావతి, యనమనగండ్ల రవి, ముండ్ల ఏకాంబరం, కేసగాని ఉపేందర్, రేగళ్ల మంగయ్య, గంగా ధరణి, ఉపేందర్, భాగ వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

