మునగాలకు వందే భారత్ జాతీయ సమైక్యత అవార్డు
మూడు దశాబ్దాలుగా జానపద కళ ద్వారా సామాజిక చైతన్యం
పల్లెపల్లెకూ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన
కాకతీయ, ఖమ్మం టౌన్: ప్రముఖ జానపద కళాకారుడు, తెలంగాణ సాంస్కృతిక సారథి మునగాల వెంకటరత్నం వందే భారత్ జాతీయ సమైక్యత అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని పైడి జయరాజు ఫ్రీవ్యూ థియేటర్లో నిర్వహించిన కార్యక్రమంలో సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం స్వీకరించారు. ఖమ్మం జిల్లాలో సుమారు 30 ఏళ్లుగా సమాచార పౌర సంబంధాల శాఖతో కలిసి జానపద కళ ద్వారా సంక్షేమ పథకాలు, సారా నిషేధం, పర్యావరణ పరిరక్షణ, ఎయిడ్స్ నివారణ, కుటుంబ నియంత్రణ, అక్షరాస్యత, అంటరానితనం, బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గతంలో పలువురు సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ల నుంచి అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. డీఐపీఆర్వో మహమ్మద్ గౌస్, వందనం సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు, పొన్నం చిన్నశంకర్, శ్రీనివాసరావు, సీనియర్ కళాకారులు కన్నెబోయిన అంజయ్య, మిమిక్రీ సుధాకర్, పమ్మి రవి, పాగి వెంకన్న, బీరెల్లి రమణ, నందు గురవయ్య, జాను మొగిలి, వెంకటేశ్వర్లు అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ, డాక్టర్ వంశీ రామరాజు, జెన్ని, పోలా ప్రగడ జనార్దన్‌రావు, చొక్కపు వెంకటరమణ, మల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

