కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కాంగ్రెస్ కుట్ర
బీఆర్‌ఎస్ చందుర్తి మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య
కాకతీయ,చందుర్తి : పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ చందుర్తి మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య ఆరోపించారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందించారని తెలిపారు. కళ్యాణలక్ష్మిని కొనసాగించడంతో పాటు ఆడబిడ్డలకు అదనంగా తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. హైకోర్టు నాలుగుసార్లు గడువు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మరాటి మల్లిక్, మాజీ ఏఎంసీ చైర్మన్ డప్పుల అశోక్, సర్పంచులు మాందాల అబ్రహం, కపిల శంకర్, కొక్కుల నరేష్, నాయకులు అసిన్పర్తి సుధాకర్, ఎండీ సమీర్, పోతరాజు నగేష్, ఏకే రావు, దుమ్మ ఆనంద్, బత్తుల కమలాకర్, సంటి బాపురావు, మాదాసు ప్రసాద్, పోతరాజు తిరుపతి, మరాటి భూపతి, గుంటి గంగాధర్, రవీందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

