యూరియా లేక రైతుల ఆవేదన
ఉమ్మడి మానాలలో బుకింగ్‌కు బ్రేక్
పది రోజులుగా రైతు వేదిక చుట్టూ ప్రదక్షిణలు
పొడు భూముల రైతులకు ఎరువులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం
పట్టా రైతులకు ఇస్తే.. తమకెందుకు ఇవ్వరని ప్రశ్న
కాకతీయ, రుద్రంగి : సాగు చేసిన పంటలకు యూరియా అందక రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ఉమ్మడి మానాల గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజులుగా యూరియా బుకింగ్ కోసం రైతు వేదికకు తిరుగుతున్నా ఆన్లైన్లో నమోదు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొడు భూముల్లో సాగు చేస్తున్న రైతులకు యూరియా అందించకపోవడంపై వారు నిరసనకు దిగారు. గత ప్రభుత్వం జారీ చేసిన పొడు భూముల ప్రొసీడింగ్ కాపీలను చూపిస్తూ.. పట్టా భూముల రైతులకు యూరియా ఇస్తున్నప్పుడు తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం సాగుకు అనుమతులు ఇచ్చి ప్రొసీడింగ్‌లు అందజేసినప్పటికీ ఎరువుల విషయంలో తమను పక్కన పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలం పంటలకు ప్రస్తుతం యూరియా అత్యవసరమని, పది రోజులుగా బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నా ఆన్లైన్లో నమోదు కాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ‘‘యూరియా లేకపోతే పంటలను ఎలా కాపాడుకోవాలి..?’’ అని ప్రశ్నించారు. పొడు భూముల ప్రొసీడింగ్‌లను ప్రాతిపదికగా తీసుకుని వెంటనే యూరియా బుకింగ్‌కు అవకాశం కల్పించాలని, అర్హులైన రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని ఉమ్మడి మానాల రైతులు డిమాండ్ చేశారు.

