రహదారులపై వీధి కుక్కల స్వైర విహారం
రాయపర్తి మండలంలో భయాందోళన
గుంపులుగా సంచారం.. మహిళలు, చిన్నారులు, వృద్ధుల్లో ఆందోళన
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
కాకతీయ, రాయపర్తి : రాయపర్తి మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లలో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల చిన్నారులు, వృద్ధులపై కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. కుక్కలు అకస్మాత్తుగా ద్విచక్ర వాహనాలకు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి వాహనదారులు కిందపడుతున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రి, వేకువజామున ద్విచక్ర వాహనాలు, ఆటోలను కుక్కల గుంపులు వెంబడిస్తున్నాయని తెలిపారు. చిన్నారులు, వృద్ధులు కుక్కకాటుకు గురవుతున్నా పంచాయతీ, పశుసంవర్ధక శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలకు టీకాలు, ఎబీసీ శస్త్రచికిత్సలు చేపట్టాలని కోరుతున్నారు. రహదారిపైకి వెళ్లాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రాయపర్తి నివాసి పీరని రవీందర్ అన్నారు. ప్రతి వీధిలో కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని, చిన్నారులు, వృద్ధులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.

