అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. చందుర్తిలో దళితుల ఆగ్రహజ్వాల!
రామస్వామిపై అట్రాసిటీ కేసు.. తక్షణ అరెస్టుకు డిమాండ్
రోడ్డుపై బైఠాయింపు.. పోలీస్ స్టేషన్ వరకు ఆందోళన
24 గంటల్లో చర్యలు తీసుకోకుంటే సీఎం సభను అడ్డుకుంటాం!
కాకతీయ,చందుర్తి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దళిత సంఘాలు తీవ్ర నిరసనకు దిగాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం.. అనంతరం పోలీసులకు వినతిపత్రం
ఆందోళనకు ముందు దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్సై రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అంబేడ్కర్‌పై, దళితులను ఉద్దేశించి రామస్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులనే అనుభవిస్తూ, అదే రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
“24 గంటల్లో చర్యలు తీసుకోవాలి.. లేదంటే ఉద్యమం ఉధృతం”
రామస్వామిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు తక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ నెల 30న సిరిసిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్న సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ పరిణామంతో చందుర్తిలో రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీసింది. కార్యక్రమంలో దళిత, కుల సంఘాల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

