రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది
:ఏఎంసి చైర్మన్ చేలుకల తిరుపతి
మానాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కాకతీయ, రుద్రంగి :మండలంలోని మానాల గ్రామంలో పాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని అన్నారు.రైతులు దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి పూర్తి మద్దతు ధర పొందాలని కోరారు.రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, తడి లేకుండా, తరుగు, చెత్త లేకుండా శుభ్రంగా తీసుకురావాలని తెలిపారు. తేమ శాతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటేనే కొనుగోలు చేస్తారని, కాబట్టి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ అవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్ర శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ దాసరి అశోక్, డైరెక్టర్లు రవీందర్ రెడ్డి, లింగారెడ్డి, అమర్ సింగ్, శ్రీనివాస్, దిలీప్, బుమన్న, సాయి, నిర్వాహకులు రాజారాం, సెక్రటరీలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

