నగర పరిశుభ్రతలో నిర్లక్ష్యానికి తావులేదు
చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపుపై ప్రత్యేక దృష్టి
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్ఠం చేయాలని, ఉప కమిషనర్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ పనులను స్వయంగా పర్యవేక్షించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రోజువారీ చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపు, రోడ్లు, ప్రధాన నాలాలు, బహిరంగ ప్రదేశాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డ్రై రిసోర్స్ కలెక్షన్ కేంద్రాలు, వేస్ట్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. వ్యర్థాల వేర్పాటు, నిల్వ, రవాణా, రీసైక్లింగ్ ప్రక్రియలు నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలన్నారు. తనిఖీల్లో గుర్తించిన సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించే సిబ్బంది వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సీఎంహెచ్వో, ఎంహెచ్వో, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు ఉప కమిషనర్ల సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోన జోన, ఉప కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

