గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు.. వైద్యులను సంప్రదించాలి
ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి
డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం. అప్పయ్య
కాకతీయ, హనుమకొండ : గుండె సంబంధిత వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. అప్పయ్య సూచించారు. గుండె నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మంగళవారం హనుమకొండలోని అశోక కాన్ఫరెన్స్ హాల్లో ఏకశిలా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎంహెచ్‌వో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడంతో పాటు శారీరక వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని అప్పయ్య సూచించారు. గుండె సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ నడక, వ్యాయామం, యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు. నెల రోజులపాటు ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయరాదని డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్, డాక్టర్ రామకృష్ణ రెడ్డి, డాక్టర్ అనిల్ బన్నా, డాక్టర్ చేతన్ కృష్ణ, డాక్టర్ లావణ్య, డాక్టర్ సబీహా నిగార్ సూచించారు. 560 మందికి పైగా ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హాస్పిటల్ జనరల్ మేనేజర్ శీదేవితో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

