సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
550 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
హెలిప్యాడ్, కాన్వాయ్ మార్గాల్లో ప్రత్యేక నిఘా
ట్రాఫిక్ మళ్లింపులు.. ప్రజలు సహకరించాలి
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెప్టెంబర్ 30న కరీంనగర్‌కు రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పర్యటన ప్రశాంతంగా, సజావుగా జరిగేలా భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్, కాన్వాయ్ మార్గాలు, పాత కలెక్టరేట్, నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ పరిసరాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధి నుంచి సుమారు 550 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్లు వెల్లడించారు. కార్యక్రమ ప్రాంగణాల్లో ప్రవేశ నియంత్రణ అమలు చేస్తూ అనుమతి ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామన్నారు. అధికారిక పాస్‌లు ఉన్న మీడియా ప్రతినిధులకు ప్రత్యేక మీడియా గ్యాలరీలో ప్రవేశం ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతిమ థియేటర్ నుంచి మమత థియేటర్ వరకు వాహనాల రాకపోకలను నియంత్రించి, అవసరమైన చోట్ల ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నట్లు కమిషనర్ తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రిజర్వు బలగాలు, ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. ట్రాఫిక్ మళ్లింపులను గమనించి పోలీసులకు ప్రజలు, వాహనదారులు సహకరించాలని కోరారు.

