100 శాతం పంటను కొనాలి
మద్దతు ధర ప్రకటనతో బాధ్యత పూర్తినట్లు కాదు
వర్షాభావ ప్రాంతాలను గుర్తించాలి
కరువు మండలాలపై ప్రణాళికలు, ప్రతిపాదనలు రూపొందించాలి
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సమగ్రంగా కరువు అంచనా వేయాలి
ఎల్‌నినో పరిస్థితుల్లో రైతుకు మద్దతు ధర దక్కాలి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండలాన్ని యూనిట్‌గా తీసుకుని కరువు మండలాల ప్రతిపాదనలకు అవసరమైన సమాచారాన్ని అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కరువు తీవ్రతను బహుళ సూచికల ఆధారంగా అంచనా వేసి, అవసరమైన చోట క్షేత్రస్థాయి పరిశీలనతో పంట నష్టాన్ని నిర్ధారించాలని సూచించారు. కేంద్ర వ్యవసాయ శాఖ రూపొందించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం కేవలం వర్షపాతం లోటును మాత్రమే కాకుండా వర్షపాతం వ్యత్యాసం, ఎస్పీఐ, పొడి కాలం, విత్తిన విస్తీర్ణం, ఎన్‌డీవీఐ/ఎన్‌డీడబ్ల్యూఐ, వీసీఐ, నేల తేమ, రిజర్వాయర్ నిల్వలు, భూగర్భజల పరిస్థితులు, ప్రవాహ జలాలు, పశుగ్రాసం, తాగునీరు, ఉపాధి, వలసలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి తెలిపారు.
లోటు వర్షపాతాన్ని గుర్తించాలి
సాధారణ వర్షపాతంతో పోలిస్తే 20 నుంచి 59 శాతం లోటును లోటు వర్షపాతంగా, 60 నుంచి 99 శాతం లోటును భారీ లోటుగా, వర్షం పూర్తిగా లేకపోతే అత్యంత తీవ్రమైన పరిస్థితిగా పరిగణించాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయని తుమ్మల తెలిపారు. సాగు విస్తీర్ణం సాధారణంతో పోలిస్తే 85 శాతం కంటే తక్కువగా ఉంటే కరువు పరిస్థితికి, 75 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటే తీవ్రమైన కరువుకు సూచికగా పరిగణించాలని చెప్పారు. మద్దతు ధర ప్రకటించడంతో కేంద్రం బాధ్యత పూర్తికాదని, ఆ ధర ప్రతి రైతుకు అందేలా చూడటం కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యతేనని తుమ్మల అన్నారు. రబీ మార్కెటింగ్ సీజన్ 2027–28కు సంబంధించి కుసుమకు క్వింటాల్‌కు రూ.675, రేప్‌సీడ్–ఆవాలకు రూ.413, మసూర్‌కు రూ.390, బార్లీకి రూ.136, శనగకు రూ.83, గోధుమకు రూ.25 చొప్పున మద్దతు ధర పెంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ధరల మద్దతు పథకం కింద పప్పుధాన్యాలు, నూనెగింజల మొత్తం ఉత్పత్తిలో నాఫెడ్ ద్వారా 25 శాతం మాత్రమే సేకరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎల్‌నినో, వాతావరణ మార్పుల నేపథ్యంలో మద్దతు ధర ప్రకటించిన పంటలన్నింటినీ కేంద్రం 100 శాతం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. ప్రకటించిన మద్దతు ధరకు 100 శాతం పంటల సేకరణ జరిగినప్పుడే రైతులకు పూర్తి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, మార్కెటింగ్ ఎండీ రాహుల్ రాజ్, ఉద్యానవన శాఖ ఎండీ యాస్మిన్ బాషా పాల్గొన్నారు.

