పరిహారం ఇచ్చాకే రోడ్డు విస్తరణ చేపట్టాలి
300 కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య
కాకతీయ , చిగురుమామిడి : రోడ్డు విస్తరణలో ఇళ్లు, ఇంటి స్థలాలు కోల్పోతున్న బాధితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న సుమారు 300 కుటుంబాలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సముచిత నష్టపరిహారం చెల్లించాలని, పరిహారం ఇవ్వలేని పక్షంలో గ్రామం వెలుపల నుంచి బైపాస్ రహదారి నిర్మించి న్యాయం చేయాలని కోరారు. దీక్షా శిబిరంలో నాలుగు వరుసల రహదారి ఊర్లో నుంచి వద్దు.. బైపాస్ నుంచే ముద్దు అంటూ బాధితులు నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని మామిడి అంజయ్య, మాజీ ఎంపీటీసీ కత్తుల రమేష్‌యాదవ్, గ్రామ శాఖ కన్వీనర్ కాశబోయిన రాజుయాదవ్, శ్యామకూర సంపత్‌రెడ్డి, నిలిగొండ దశరథం డిమాండ్ చేశారు. ఉల్లెంగుల తిరుపతి, బాలరాజు, గుగ్గిళ్ల వేణుమాధవ్, రాజిరెడ్డి, అంజయ్య, తిరుపతి, వెన్నయ్య, వెంకటి, లక్ష్మీ, రవీందర్, స్వర్ణ, కనకవ్వ, రజితతో పాటు గ్రామస్తులు, బాధితులు పాల్గొన్నారు.

