మోయినాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ వల
ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణి
సీనియర్ అసిస్టెంట్ ద్వారా నగదు తీసుకుంటుండగా పట్టివేత
నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్
గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ సుదర్శన్‌లపై కేసు నమోదు
కాకతీయ, హైదరాబాద్ : నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.75 వేల లంచం తీసుకుంటూ మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ యెలమోని సుదర్శన్ ఏసీబీకి చిక్కినట్లు అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి నుంచి సీనియర్ అసిస్టెంట్ యెలమోని సుదర్శన్ ద్వారా గుండు వాణి లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది. మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణిగా పనిచేస్తున్న గుండు వాణి, గతంలో మోయినాబాద్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం డిప్యూటేషన్‌పై సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న యెలమోని సుదర్శన్ కలిసి లంచం తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. ఫిర్యాదుదారుడి నిర్మాణాన్ని అక్రమంగా పరిగణించి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఈ మొత్తం డిమాండ్ చేసినట్లు తెలిపింది.
సీనియర్ అసిస్టెంట్ వద్ద నగదు
రూ.75 వేల లంచం మొత్తాన్ని యెలమోని సుదర్శన్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అధికారిక విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అనుచిత ప్రయోజనం పొందేందుకు ఇద్దరు అధికారులు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. ఏసీబీ అధికారులు గుండు వాణి, యెలమోని సుదర్శన్‌లను అరెస్టు చేసి నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు.

