లీకేజీలతో తాగునీరు వృథా.. అధికారుల నిర్లక్ష్యం
నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు.. రోడ్డుపై వృథాగా నీరు
కాకతీయ,శంకరపట్నం:శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా తాగునీరు వృథాగా పోతోంది. మొలంగూర్ నుంచి మక్త గ్రామానికి వెళ్లే మార్గంలో సుమారు పది మీటర్ల పరిధిలో రెండు చోట్ల పైప్‌లైన్లు లీకేజీకి గురై నెలలు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లీకేజీల నుంచి నీరు నిరంతరం రోడ్డుపైకి చేరడంతో అక్కడ గుంతలు ఏర్పడి వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విలువైన తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను గ్రామ సర్పంచ్ పూదరి రాజు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదని గ్రామస్తులు తెలిపారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లీకేజీలకు తక్షణమే మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టడంతో పాటు రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

