విద్యార్థుల విజ్ఞాన వికాసానికి గ్రంథాలయం దోహదం
శాయంపేట పాఠశాలలో బమ్మెర పోతన గ్రంథాలయం ప్రారంభం
సొంత నిధులతో గ్రంథాలయం ఏర్పాటు చేసిన తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాస్
కాకతీయ, గీసుగొండ : విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు విజ్ఞానాన్ని విస్తరించేందుకు గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని అకాడమిక్ ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ నోడల్ అధికారులు గాయపు లింగారెడ్డి, సోగాల అంజయ్య అన్నారు. మండలంలోని శాయంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బమ్మెర పోతన గ్రంథాలయం పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చక్రవర్తుల శ్రీనివాస్ తన సొంత నిధులతో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం విశేషం. అకాడమిక్ ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ నోడల్ అధికారులు గాయపు లింగారెడ్డి, సోగాల అంజయ్య గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మల్లెపాక సరిత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గాయపు లింగారెడ్డి మాట్లాడుతూ తెలుగు ఉపాధ్యాయుడు చక్రవర్తుల శ్రీనివాస్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తన సొంత ఖర్చులతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆయన చేస్తున్న విద్యాసేవలు ప్రశంసనీయమని కొనియాడారు. విద్యార్థులు గ్రంథాలయంలోని పుస్తకాలను సద్వినియోగం చేసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సోగాల అంజయ్య మాట్లాడుతూ పుస్తకాలు విద్యార్థులకు అసలైన నేస్తాలని, పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం, ఆలోచనా శక్తి, వ్యక్తిత్వ వికాసం పెరుగుతాయని తెలిపారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రంథాలయ ఏర్పాటుకు కృషి చేసిన తెలుగు ఉపాధ్యాయుడు చక్రవర్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించి, వారికి విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో సొంత నిధులతో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల ప్రయోజనమే ప్రధాన లక్ష్యంగా గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని, పుస్తకాలు వితరణ చేయాలనుకునే దాతలు, ఔత్సాహికులు ముందుకు వచ్చి గ్రంథాలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ప్యానెల్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు నుస్రత్ ఆరా, పద్మశ్రీ, జ్యోతి, రమణారెడ్డి, వనజ, రోజ్ మేరీ, ఖాజా పాషా, శశికళ, సుష్మా తదితరులు పాల్గొన్నారు.

