అమరవీరుల ఆశయాల సాధన కోసం పోరాడాలి
కామ్రేడ్ మండల వెంకన్న
కామ్రేడ్ సురేష్, గణపతిల స్తూపంపై జెండావిష్కరణ ఘనంగా నివాళులు
కాకతీయ, నెల్లికుదురు: అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రజా ఉద్యమాలను కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న అన్నారు. నెల్లికుదురు మండలం లోని రావిరాల గ్రామంలో కామ్రేడ్స్ సురేష్ అన్న, గణపతిల స్తూపంపై సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం జెండావిష్కరణ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మండల వెంకన్న మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను కొనసాగించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని, స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు గడిచినా దేశంలో భూసమస్య పరిష్కారం కాలేదని, పేదల బతుకుల్లో ఆశించిన మార్పు రాలేదని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల జీవన పరిస్థితులు మారడం లేదని, ఒకవైపు కార్పొరేట్ శక్తులకు పాలకులు అండగా నిలుస్తుంటే మరోవైపు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు కనీస హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి కొనసాగుతోందని, గ్రామీణ పేదలు నేటికీ ఉపాధి హామీ పనులపైనే ఆధారపడాల్సి రావడం పాలకుల అభివృద్ధి విధానాల వైఫల్యానికి నిదర్శనమని, అమరవీరుల సంస్మరణ సభలు కేవలం నివాళులకే పరిమితం కాకుండా, వారు ఆశించిన సమసమాజ స్థాపన కోసం ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. విప్లవ పార్టీల నిర్మాణాన్ని బలోపేతం చేస్తూ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలను ఐక్యం చేసి దోపిడీ, పీడన, అసమానతలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న, జిల్లా నాయకులు
చిర్ర యాదన్న, బట్టు చైతన్య, డివిజన్ నాయకులు నక్క యాకన్న, పల్లె రమేష్, గుగులోతు వీరన్న, తారమ్మ, మైబు, వెంకన్న, రమేష్, భూలక్ష్మి, యశోద, యాదమ్మ, సరూప, సరిత, గాద విజయ, చిన్నా, రేణుక, టోనికే వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

