భట్టి సారూ మీరైనా పట్టించుకోండి
కాజీపేట ఆర్వోబీపై ఎడతెగని నిర్లక్ష్యం
ఏడేళ్లుగా కొలిక్కిరాని ఫాతిమానగర్ వంతెన నిర్మాణం
2017లో రూ.78 కోట్లతో పరిపాలనా అనుమతులు
2021లో ప్రారంభమైన పనులు..నేటికి కొనసాగుతూనే ఉన్న వైనం
గడ్డర్ల తయారీ, అమరికలో కాంట్రాక్టర్ తీవ్ర జాప్యం
గడువులు మారుతున్నా అందుబాటులోకి రాని వంతెన
కాకతీయ, తెలంగాణ బ్యూరో : “భట్టి సారూ.. మీరైనా కాజీపేట ఆర్వోబీ పనులపై దృష్టి సారించండి.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఫాతిమానగర్ వంతెనను పూర్తిచేయించి వరంగల్ ప్రజలకు ఉపశమనం కల్పించండి” అని నగరవాసులు కోరుతున్నారు. బుధవారం వరంగల్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్న నేపథ్యంలో కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ జాప్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2017లో రూ.78 కోట్లతో పరిపాలనా అనుమతులు పొందిన ఈ ప్రాజెక్టు పనులు 2021లో ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తికాలేదు. వంతెనకు ఇరువైపులా నిర్మాణాలు చాలావరకు పూర్తయినప్పటికీ రైల్వే ట్రాక్‌పై ఏర్పాటు చేయాల్సిన స్టీల్ గడ్డర్ల తయారీ, సరఫరా, అమరికలో జాప్యం కొనసాగుతోంది. పలుమార్లు గడువులు ప్రకటించినా వంతెన అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆర్వోబీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి, నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు ఆశిస్తున్నారు.

రూ.78 కోట్లతో మొదలైన పనులు
కాజీపేట–హనుమకొండ మధ్య జాతీయ రహదారి 163పై రైల్వే మార్గాన్ని దాటే ప్రాంతంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017 అక్టోబరు 5న జీవో నంబర్ 539 ద్వారా రూ.78 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. కాజీపేట–బల్లార్షా రైల్వే సెక్షన్‌లో 365/31–33 కిలోమీటర్ల వద్ద సుమారు 870 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో వంతెన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. భూసేకరణ, విద్యుత్ లైన్లు, కేబుళ్లు, పైపులైన్ల మార్పిడి, సర్వీస్ రోడ్ల పనులను కూడా ప్రాజెక్టులో చేర్చారు. అయితే పరిపాలనా అనుమతులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభం కాలేదు. టెండర్లు, భూసేకరణ, రైల్వే భూమి వినియోగానికి సంబంధించిన ప్రక్రియల అనంతరం 2021లో నిర్మాణం మొదలైంది. 2021 డిసెంబరు 31 నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఆ గడువు దాటిపోయింది. అనుమతులు వచ్చిన నాలుగేళ్లకు పనులు ప్రారంభం కావడం ప్రాజెక్టు అమలులో తొలి జాప్యంగా నిలిచింది.

గడ్డర్ల తయారీ, అమరికలో జాప్యం
వంతెనకు ఇరువైపులా పిల్లర్లు, కాంక్రీట్ నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ రైల్వే ట్రాక్‌పై నిర్మించాల్సిన మధ్యభాగం కీలకంగా మారింది. ఈ భాగంలో స్టీల్ గడ్డర్ల ఏర్పాటు కోసం రైల్వే శాఖ అనుమతులు, సాంకేతిక ప్రణాళికల ఆమోదం అవసరమైంది. 2023 మే నాటికి రైల్వే అనుమతుల కోసం సుమారు ఆరు నెలలుగా నిరీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. అదే ఏడాది డిసెంబరులో కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, మధ్యభాగంలో స్టీల్ నిర్మాణం మాత్రమే మిగిలిందని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. మూడు నెలల్లో వంతెనను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించినప్పటికీ ఆ గడువు కూడా నెరవేరలేదు. గడ్డర్ల తయారీ, సరఫరా, రవాణా, అమరిక పనులు ఆలస్యమయ్యాయి. రైల్వే అనుమతులు, సాంకేతిక అంశాలతోపాటు గడ్డర్ల తయారీకి సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే సమన్వయం చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థ, సంబంధిత అధికారులపై ఉంది. ఈ ప్రక్రియలో ఎక్కడ జాప్యం జరిగింది? గుత్తేదారు ఒప్పందంలోని కాలపరిమితిని ఎందుకు పాటించలేకపోయారు? ఆలస్యానికి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అన్న అంశాలు కీలకంగా మారాయి.

శిథిలావస్థకు చేరిన ప్రస్తుత ఆర్వోబీ
మీక్షలు.. హామీలు.. దాటిపోతున్న గడువులు
నిర్మాణ జాప్యంపై ప్రజల్లో అసహనం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు పనులను పరిశీలించి గడువులు ప్రకటించారు. 2024 నవంబరులో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, అప్పటి కలెక్టర్ ప్రావీణ్య, సంబంధిత శాఖల అధికారులు నిర్మాణ పురోగతిని సమీక్షించారు. 2025 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని ప్రకటించినా ఆ గడువు దాటిపోయింది. 2025 సెప్టెంబరులో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మరోసారి పనులను పరిశీలించి నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 2026 జనవరిలో కూడా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రైల్వే శాఖ పరిధిలోని పనులు, ఇతర ప్రాంతాల నుంచి భారీ పరికరాలను తీసుకురావాల్సిన అవసరం జాప్యానికి కారణాలుగా వివరించారు. 2026 ఆగస్టు 14న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పనులను పరిశీలించి సాంకేతిక సమస్యలను పరిష్కరించి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ వంతెన ప్రారంభానికి నిర్దిష్ట తేదీ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడలేదు.
భట్టి పర్యటనతోనైనా కదలిక వస్తుందా?
కాజీపేట ఆర్వోబీ అందుబాటులోకి వస్తే కాజీపేట–హనుమకొండ మధ్య ప్రయాణం సులభతరం కావడంతోపాటు వరంగల్–హైదరాబాద్ మార్గంలో వాహనాల రాకపోకలకు ఊరట లభించనుంది. ఆర్టీసీ బస్సులు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, అత్యవసర సేవల వాహనాలకు ప్రయోజనం కలుగుతుంది. ఏళ్లుగా నిర్మాణం కొనసాగుతుండటంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం వరంగల్ పర్యటనకు వస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్వోబీ నిర్మాణ పరిస్థితిని పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్షించి, పనులు పూర్తయ్యేలా స్పష్టమైన గడువు నిర్ణయించాలని నగరవాసులు కోరుతున్నారు. గుత్తేదారు పనుల పురోగతిపై సమీక్ష, గడ్డర్ల తయారీ–అమరికకు కార్యాచరణ, మిగిలిన పనుల పూర్తి తేదీని ప్రకటిస్తేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. ఇప్పటివరకు సాగిన హామీల పరంపరకు ముగింపు పలికి వంతెనను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని త్రినగరి ప్రజలు ఉప ముఖ్యమంత్రిని కోరుతున్నారు.

