ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి!
నవంబర్ 14న హనుమకొండలో ఆరో రాష్ట్ర సదస్సు
ఐఎల్‌పీఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చిల్ల రాజేంద్ర ప్రసాద్ పిలుపు
కాకతీయ, హన్మకొండ : హనుమకొండలో ఈ నెల 14న నిర్వహించనున్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్‌పీఏ) తెలంగాణ ఆరో రాష్ట్ర సదస్సుకు రాష్ట్రంలోని న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఐఎల్‌పీఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, సదస్సు కన్వీనర్ చిల్ల రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు, ఐఎల్‌పీఏ నాయకులతో కలిసి గోడపత్రికలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ సిద్ధాంతాల పునాదిగా, అంబేడ్కర్ ఇచ్చిన ‘పే బ్యాక్ టు సొసైటీ’ పిలుపును లక్ష్యంగా చేసుకుని ‘నల్లకోట్లతో నీలి విప్లవం’ నినాదంతో సంఘం పనిచేస్తోందన్నారు. బహుజన, అణగారిన, పేద న్యాయవాదుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంతోపాటు సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
రాజ్యాంగ స్ఫూర్తిని గ్రామగ్రామానికి తీసుకెళ్తాం
ఐఎల్‌పీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సదస్సు కో-కన్వీనర్ తీగల జీవన్ గౌడ్ మాట్లాడుతూ సాంస్కృతిక విప్లవం విజయవంతం కాకుండా బహుజన సమాజ విముక్తి సాధ్యం కాదన్నారు. రాజ్యాంగం కేవలం న్యాయవాదులకు ఉపయోగపడే గ్రంథం మాత్రమే కాదని, బడుగు, బలహీన వర్గాల జీవితాలను మార్చే స్ఫూర్తిదాయక సాధనమని పేర్కొన్నారు. ఐఎల్‌పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు చౌదరి వికాస్ పటేల్ అధ్యక్షతన సదస్సు జరుగుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ కమిషన్ కమిషనర్ జస్టిస్ ఈద తిరుమలదేవి, గౌరవ అతిథులుగా వరంగల్, హనుమకొండ జిల్లా జడ్జిలు వి.బి. నిర్మలా గీతాంబ, ఎం.ఆర్. సునీత, పంచాయతీరాజ్ మంత్రి దనసరి అనసూయ సీతక్క, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరవుతారని వివరించారు. ‘79 ఏళ్ల స్వతంత్ర భారతంలో మహిళా స్వేచ్ఛ’, ‘ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు’, ‘సామాజిక న్యాయం–బహుజనుల ఐక్యత’, ‘ప్రజాస్వామ్యంలో జడ్జీల నియామకం–లోపాలు’ అంశాలపై ప్రొఫెసర్లు ఇ. సుధారాణి, గుగులోతు వీరన్న నాయక్, తెలుగు అకాడమీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ఐఎల్‌పీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొన్నం దేవరాజు గౌడ్ ప్రసంగిస్తారని తెలిపారు. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.జె. శాంసన్, బహుజన ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు దాసురాం నాయక్, రాష్ట్రీయ ముక్తి మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ మహమ్మద్ ఫహీమొద్దీన్, బ్యాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి. నరేందర్ తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. కార్యక్రమంలో ఐఎల్‌పీఏ రాష్ట్ర కమిటీ సలహాదారు బండి మొగిలి, సభ్యులు ఎగ్గడి సుందర్ రామ్, జన్ను పద్మ, జిల్లా, బార్ అసోసియేషన్ల నాయకులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

