దొడ్ల కొత్తూరులో భారీగా నాటుసారా నిల్వలు
పోలీసుల కార్డన్ సెర్చ్‌లో 4 వేల లీటర్ల బెల్లం పానకం, 200 లీటర్ల నాటుసారా స్వాధీనం
కాకతీయ, ములుగు: ఏటూరునాగారం మండలం దొడ్ల కొత్తూరు గ్రామంలో నాటుసారా తయారీకి సంబంధించిన భారీ నిల్వలు బయటపడ్డాయి. ఏటూరునాగారం పోలీసులు గురువారం గ్రామంలో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో విస్తుపోయే స్థాయిలో బెల్లం పానకం, నాటుసారా పట్టుబడ్డాయి. గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు సుమారు 4 వేల లీటర్ల బెల్లం పానకంతో పాటు 200 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో బెల్లం పానకం నిల్వలు, సిద్ధంగా ఉన్న నాటుసారా బయటపడటం కలకలం రేపింది. గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారీ, నిల్వలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఏటూరునాగారం ఎస్సై వెల్లడించారు.

