పీఎం రాహత్ పథకం అమలులో నిర్లక్ష్యం వద్దు
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం
సిజేరియన్ ప్రసవాలపై ప్రతి నెలా ఆడిట్ నిర్వహించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశం
కాకతీయ, హనుమకొండ: జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా తక్షణమే నగదు రహిత వైద్యం అందించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో పథకం అమలు, సహజ ప్రసవాల ప్రోత్సాహం, వైద్య సేవల వివరాల నమోదు అంశాలపై సమీక్ష నిర్వహించారు. వైద్యపరమైన అవసరం ఉన్నప్పుడే సిజేరియన్ ప్రసవాలు చేయాలని, సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో సిజేరియన్ ప్రసవాలపై ప్రతి నెలా ఆడిట్ నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. అనవసరంగా సిజేరియన్లు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రుల వివరాలు, ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ సేవలు, ప్రసవాలు తదితర సమాచారాన్ని హెచ్ఎంఐఎస్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ. అప్పయ్య మాట్లాడుతూ పీఎం రాహత్ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్యం అందుతుందని తెలిపారు. వివరాలను టీఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. హెచ్ఐవీ, టీబీ, క్యాన్సర్ వివరాలను సంబంధిత పోర్టళ్లలో నమోదు చేయడంతో పాటు నవజాత శిశువులకు టీకాలు వేయాలని సూచించారు. సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ రజిత, డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ ప్రదీప్‌రెడ్డి, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

