తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు
ఐటీడీఏ పీఓ క్షేత్రస్థాయి పరిశీలన
రైనిగూడెం ఆశ్రమ పాఠశాల, పీహెచ్‌సీని సందర్శించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిలెనిన్ వత్సల్ టోప్పో
విద్య, వైద్య సేవల నాణ్యతపై సమీక్ష
కాకతీయ, ఏటూరునాగారం రూరల్: గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్య రంగాల పనితీరును మెరుగుపరిచేందుకు ఐటీడీఏ యంత్రాంగం క్షేత్రస్థాయిలో దృష్టి సారించింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెరగడంతో పాటు, మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అన్న అంశాలపై ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో స్వయంగా పరిశీలన చేపట్టారు. గురువారం రైనిగూడెంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వాటి పనితీరును సమీక్షించారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మధ్యకు వెళ్లిన పీఓ తరగతి గదుల్లో బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి పాఠ్యాంశాలపై వారికి ఉన్న అవగాహనను పరీక్షించారు. పాఠ్యపుస్తకాలను పరిశీలిస్తూ విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. కేవలం పాఠాలు బోధించడమే కాకుండా ప్రతి విద్యార్థికి విషయ పరిజ్ఞానం అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం పీహెచ్‌సీని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, నిల్వలపై వైద్య సిబ్బందితో సమీక్షించారు. గిరిజన గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్య పునాది కాగా ప్రజల ఆరోగ్యానికి మెరుగైన వైద్యం కీలకమని భావిస్తూ ఈ రెండు రంగాలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పీఓ పర్యటన స్పష్టం చేసింది.


