చుంచురా కాంగ్రెస్ అబ్జర్వర్‌గా సిరాజ్ హుస్సేన్
కాకతీయ, కరీంనగర్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చుంచురా నియోజకవర్గానికి కాంగ్రెస్ అబ్జర్వర్‌గా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ మైనార్టీ విభాగం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్ గర్హి ఉత్తర్వులు జారీ చేశారు.నియామకం అనంతరం అబ్జర్వర్లు వెంటనే నియోజకవర్గానికి చేరుకుని స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయం సాధిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా వ్యూహాత్మకంగా పనిచేయాలని సూచించారు.సిరాజ్ హుస్సేన్ మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కట్టుబడి పనిచేస్తానన్నారు. చుంచురా నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, సీనియర్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

