యువతకు అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తి
జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ సందేశం
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
కాకతీయ, కొత్తగూడెం : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ ప్రధాన కూడలిలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ… స్వాతంత్ర్యం అనంతరం ప్రజాస్వామ్య పాలన కోసం రాజ్యాంగం అవసరమైందని, ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషి అపూర్వమని, విద్య, ఆర్థిక, నీటిపారుదల రంగాల్లో ఆయన చూపిన దూరదృష్టి దేశ అభివృద్ధికి పునాది అయిందన్నారు.
యువతకు అంబేద్కర్ మార్గం
ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగం గొప్పదని, “ఒక వ్యక్తి – ఒక ఓటు” సూత్రాన్ని స్థిరపరిచిన నాయకుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా సమానత్వ భావనను నెలకొల్పిన ఆయన ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ… భిన్నత్వంలో ఉన్న దేశాన్ని ఐక్యంగా నిలబెట్టింది భారత రాజ్యాంగమేనని అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత రాజ్యాంగం తక్కువ సవరణలతో సమర్థవంతంగా కొనసాగుతుండటం అంబేద్కర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అగ్నిమాపక వారోత్సవాల గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే “అరైవ్–అలైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని, వేగ నియంత్రణ పాటించాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ జడ్పీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

