ఇసుక మాఫియా బరితెగింపు
తహసీల్దార్ వాహనం మీదకి ట్రాక్టర్ ఎక్కించే ప్రయత్నం
ట్రాక్టర్ వదిలి పరారైన డ్రైవర్
కేసు నమోదు చేసిన పోలీసులు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్లలో ఇసుక మాఫియా బరితెగించారు.విధుల్లో ఉన్న తహసీల్దార్ వాహనం మీదకే ట్రాక్టర్ ఎక్కించే ప్రయత్నం చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే… సిరిసిల్లలోని సాయినగర్ రీచ్ నుంచి ఆన్లైన్ విధానంలో ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నప్పటికీ కొందరు అక్రమంగా రాంగ్ రూట్లలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రాక్టర్ల రాకపోకల వల్ల దుమ్ము ఎక్కువగా రావడంతో స్థానికులు తహసీల్దార్ మహేశ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన ఆయన మున్సిపల్ అధికారులకు తెలిపి నీటిని చల్లించే చర్యలు తీసుకున్నారు.ఈ క్రమంలో సాయినగర్ ప్రాంతంలో ఇసుక రవాణా తీరును పర్యవేక్షించేందుకు వెళ్లిన తహసీల్దార్‌కు ఓ ట్రాక్టర్ అనుమానాస్పదంగా కనిపించింది. ఇసుక లోడ్ తో రాంగ్ రూట్లో అధిక వేగంతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆపేందుకు ఆయన ప్రయత్నించారు.అయితే ట్రాక్టర్ డ్రైవర్ ఆపకుండా మరింత వేగం పెంచి నేరుగా తహశీల్దార్ వాహనం వైపు దూసుకెళ్లాడు.అప్రమత్తంగా వ్యవహరించిన తహసీల్దార్ తన వాహనాన్ని పక్కకు తిప్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు.ఈ ఘటనపై తహసీల్దార్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ శివరాత్రి శివాజీ పై సిరిసిల్ల టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.ట్రాక్టర్ ఓనర్ భాను అనే వ్యక్తి సీన్లోకి వచ్చి అంత సక్రమంగా జరిగినట్లు చెప్పుకునే ప్రయత్నం చేయగా అధికారులు సీరియస్ అయ్యారు.”ఇసుక రవాణాకు అధికారిక అనుమతులు ఉంటే ఓవర్ స్పీడ్ ఎందుకు?దీని వల్ల ట్రాక్టర్ నడిపే డ్రైవర్‌తోపాటు సామాన్యులకు ప్రాణాపాయం ఉంటుంది. కుటుంబంలో ఒకరు ప్రమాదంలో మృతి చెందితే ఆ నష్టం ఎవరు పూడ్చలేరు. నాపై జరిగిన ఈ ఘటనలో భయం కంటే ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఎవరిని ప్రమాదవశాత్తు చంపుతాడన్న ఆందోళన అధికమైంది.నిబంధనలు ఉల్లంఘిస్తూ అతివేగంతో వాహనాలు నడపడం ప్రమాదాలకు దారి తీస్తుంది”అని తహశీల్దార్ మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

