కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్‌కు భయం
జగిత్యాల సభకు ప్రజలు భారీగా రావాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
కాకతీయ, కరీంనగర్ : కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్ అని, ఆయన చరిత్రను ఎవరూ చెరపలేరని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు విస్తృతంగా మేలు చేశారని వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టే రాజకీయాలకే పరిమితమైందని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ బయటకు రారని విమర్శించిన కాంగ్రెస్ నేతలు, జగిత్యాల సభతో ఆయన ప్రజల్లోకి వస్తున్నారన్న భయంతో చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రైతుబంధు ప్రకటించడం కూడా అదే భయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలతో పేదలకు లబ్ధి
కేసీఆర్ కిట్, దళిత బంధు, వృద్ధాప్య పెన్షన్లు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చిన విషయాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో రెట్టింపు ప్రయోజనాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు చేపట్టకుండా భారీగా అప్పులు చేసి ఆర్థిక భారాన్ని పెంచిందని విమర్శించారు.20న జగిత్యాలలో జరగనున్న సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, గందె మహేశ్, మైనార్టీ నాయకులు మీర్ సౌఖత్ అలీ, నారదాసు వసంతరావు, గూడెల్లి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

